ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన ఒకేసారి రూ. 50 వేల కోట్ల విలువైన షేర్లను విరాళంగా ఇచ్చారు. బఫెట్ తన బెర్క్‌షైర్ హాత్‌వే స్టాక్‌లో 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను శుక్రవారం విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం గేట్స్ ఫౌండేషన్‌తో పాటు బఫెట్ కుటుంబ సభ్యులు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం విశేషం. వారెన్ బఫెట్ తన సంపదలో కొంత భాగాన్ని చాలా కాలంగా దానం చేస్తున్నారు. ఈ విరాళంలో మొత్తం 12.36 మిలియన్ బెర్క్‌షైర్ క్లాస్ B షేర్లు ఉన్నాయి. వీటిని వివిధ సంస్థలకు ఈ విధంగా పంపిణీ చేశారు.
- సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్: 943,384 షేర్లు (ఈ ఫౌండేషన్‌ను బఫెట్ మొదటి భార్య సుసాన్ థాంప్సన్ బఫెట్ పేరు మీద స్థాపించారు. ఇది రిప్రొడక్టివ్ హెల్త్‌కు నిధులు సమకూరుస్తుంది. దీనికి బఫెట్ కుమార్తె సుసీ బఫెట్ నేతృత్వం వహిస్తున్నారు).
- హోవార్డ్ జీ. బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్: ఈ మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 660,366 షేర్లు చొప్పున కేటాయించారు. బఫెట్ పిల్లలు హోవార్డ్, సుసీ, పీటర్ ఈ సంస్థలను చూసుకుంటారు.
షెర్వుడ్ ఫౌండేషన్ నెబ్రాస్కాలోని లాభాపేక్ష లేని సంస్థలకు, బాల్య విద్యకు సహాయం చేస్తుంది. హోవార్డ్ జీ. బఫెట్ ఫౌండేషన్ ప్రపంచంలో ఆకలిని తగ్గించడానికి, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడానికి, ఘర్షణలను తగ్గించడానికి కృషి చేస్తుంది. నోవో ఫౌండేషన్ అట్టడుగు వర్గాల బాలికలు, మహిళలు, స్వదేశీ సముదాయాల అభివృద్ధి కోసం పనిచేస్తుంది.
ఈ విరాళంతో వారెన్ బఫెట్ ఇప్పటివరకు స్వచ్ఛంద సంస్థలకు దానం చేసిన మొత్తం సంపద 60 బిలియన్ డాలర్లు దాటింది. అంటే దాదాపు రూ. 5 లక్షల కోట్లకుపైనే అన్నమాట. ఇది నిజంగా గొప్ప విషయం. గతంలో జూన్‌లో ఆయన 5.3 బిలియన్ డాలర్లు, నవంబర్‌లో 1.14 బిలియన్ డాలర్లు దానం చేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, శుక్రవారం విరాళానికి ముందు బఫెట్ నికర సంపద 152 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన ప్రపంచంలో ఐదో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఈ 6 బిలియన్ డాలర్ల విరాళం తర్వాత ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు.
94 ఏళ్ల వారెన్ బఫెట్ 2006 నుంచి తన సంపదను దానం చేయడం మొదలుపెట్టారు. గత సంవత్సరం ఆయన తన వీలునామాను మార్చారు. దాని ప్రకారం ఆయన మరణం తర్వాత మిగిలిన సంపదలో 99.5 శాతం ఒక స్వచ్ఛంద ట్రస్ట్‌కు వెళ్తుంది. ఆయన పిల్లలు సుసీ (71), హోవార్డ్ (70), పీటర్ (67) ఈ ట్రస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ట్రస్ట్ 10 సంవత్సరాలలో ఈ సంపదను పంపిణీ చేయాలి. దీనికి సంబంధించిన నిర్ణయాలను ముగ్గురు పిల్లలు కలిసి తీసుకోవాలి. గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు.. తన మరణం తర్వాత ఆగిపోతాయని బఫెట్ గతంలోనే చెప్పారు.
వారెన్ బఫెట్ 1965 నుంచి.. నెబ్రాస్కాలోని ఒమాహా కేంద్రంగా బెర్క్‌షైర్ హాత్‌వేను నడుపుతున్నారు. ఈ సంస్థ విలువ 1.05 ట్రిలియన్ డాలర్లు. ఇది గీకో కార్ ఇన్సూరెన్స్, బీఎన్ఎస్ఎఫ్ రైల్వే వంటి దాదాపు 200 వ్యాపారాలను కలిగి ఉంది. అంతేకాకుండా యాపిల్ (Apple), అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి పెద్ద కంపెనీల స్టాక్‌లలో కూడా పెట్టుబడులు పెట్టింది. విరాళాలు ఇచ్చిన తర్వాత కూడా బఫెట్‌కు బెర్క్‌షైర్ హాత్‌వేలో 13.8 శాతం వాటా ఉంది. బెర్క్‌షైర్ షేర్లను అమ్మే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. వారెన్ బఫెట్ దాతృత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన చేసిన ఈ విరాళం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa