ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ తొక్కిసలాటకు అసలైన కారణం..: పార్లమెంటులో రైల్వేశాఖ మంత్రి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:17 PM

ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు. ఒక ప్రయాణికుడి భారీ లగేజీ కిందపడటమే ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఘటనలో 18 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ నివేదికను రాజ్యసభకు సమర్పిస్తూ మంత్రి ఈ విషయాన్ని వివరించారు.


మహాకుంభ్ ఉత్సవాల కోసం రైళ్లలో ప్రయాణించడానికి భారీ సంఖ్యలో ప్రయాణికులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ 14, 15కి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB-3)పై రద్దీ ఎక్కువగా ఉంది. చాలా మంది ప్రయాణికులు తమతో పాటు పెద్ద మొత్తంలో లగేజీని, ముఖ్యంగా తలపై పెట్టుకునే భారీ సంచులను మోసుకెళ్తున్నారని మంత్రి నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల వంతెనపై ప్రయాణికుల కదలికలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. అదే సమయంలో.. ఒక ప్రయాణికుడి తలపై ఉన్న భారీ లగేజీ అదుపుతప్పి కిందపడింది. దీంతో ఆయన దాన్ని తీసేందుకు కిందకు వంగడం.. పక్కనే ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటానికి దారితీసింది. ఇలా అనేక మంది కింద పడి తొక్కిసలాట జరిగింది.


 దురదృష్టవశాత్తు పెద్ద ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదానికి గురైన వారిలో అత్యధికులు కుంభమేళా ఉత్సవాలకు వెళ్తున్న భక్తులే అని కేంద్రమంత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే 15 మంది గాయపడ్డారని కూడా గుర్తు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైందని స్పష్టం చేశారు. సంఘటనకు బాధ్యత వహిస్తూ ఐదుగురు సీనియర్ అధికారులను బదిలీ చేశారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టిందని కూడా తెలిపారు.


ముఖ్యంగా రద్దీని నియంత్రించడానికి 73 రైల్వే స్టేషన్లను శాశ్వత వెయిటింగ్ ఏరియాల కోసం గుర్తించినట్లు కేంద్ర మంతరి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతో పాటు రైల్వే వంతెనల నిర్మాణం కోసం కొత్త, విశాలమైన డిజైన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త డిజైన్‌లు రద్దీని సులభంగా నిర్వహించడంలో సహాయ పడతాయన్నారు. ప్రయాణికుల భద్రతను మెరుగు పరచడానికి, రైల్వే అధికారులు క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్‌ను కూడా కఠినతరం చేశారన్నారు. ఇలాంటి విషాదాలు జరగకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందని.. అందుకు తగినట్లుగానే ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa