అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఒకే మాటను పదే పదే చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులోనే ముగించేస్తానని తేల్చి చెప్పారు. అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఈ మాట చెప్పడంతో.. చాలా మంది ట్రంప్ అధ్యక్షుడు అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని భావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ దాదాపు 8 నెలలు కావస్తోంది. కానీ.. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఈ సందర్భంగా తాజాగా దీనిపై స్పందించిన ట్రంప్.. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నానని అంగీకరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చాలా ఈజీ అని.. అధికారంలోకి రాకముందు తాను భావించానని.. కానీ తన హయాంలో అత్యంత క్లిష్టమైన ఘర్షణ ఇదేనని ట్రంప్ పేర్కొన్నారు.
వైట్‌హౌస్‌లో అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘంగా జరుగుతున్న 7 యుద్ధాలను తాను ఇప్పటివరకు ఆపినట్లు మరోసారి పాత పాటే పాడారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపడం తన వల్ల కాలేదని తెలిపారు. గత 7 నెలల కాలంలో.. ప్రపంచవ్యాప్తంగా తాను చేసినంత పని ఎవరూ చేయలేదని.. తాను 7 యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. 31 ఏళ్లుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఓ యుద్ధం ముగియడం అసాధ్యమని ప్రపంచ దేశాలు అంతా అనుకున్నాయని.. కానీ తాను వెళ్లి 2 గంటల్లోనే దాన్ని ముగించినట్లు చెప్పారు. 35 ఏళ్ల నుంచి 37 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాలను కూడా తాను ఆపినట్లు ట్రంప్ చెప్పారు.
తనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడం చాలా తేలిక అని.. అధికారంలోకి రాకముందు అనుకున్నానని.. అయితే అది అంత సులువు కాదని ఇప్పుడు అర్థమైనట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపడం అత్యంత కష్టంగా మారిందని ట్రంప్ తెలిపారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పి.. ఒక ఒప్పందం కుదిర్చేందుకు గత కొంతకాలంగా ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతకుముందు వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయిన ట్రంప్.. ఇటీవల అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ సమావేశం అయ్యారు. పుతిన్‌తో చర్చలు సక్సెస్ అయ్యాయని.. ట్రంప్ చెప్పుకుంటున్నప్పటికీ.. ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణకు ఎలాంటి అధికారిక ఒప్పందం మాత్రం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యుద్ధం ఆపడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa