వస్తు సేవల పన్ను (GST)లో కీలక మార్పులు చేస్తూ కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ పన్ను రేట్లలో 12, 28 శాతం శ్లాబులను తొలగిస్తూ కేవలం 5, 18 శాతం శ్లాబులనే ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో చాలా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింది. అయితే, పొగాకు, పాన్ మసాలా, సైన్ గూడ్స్, లగ్జరీ వస్తువులపై మాత్రం జీఎస్టీని 40 శాతం శ్లాబులోకి మార్చారు. వాటి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మాత్రం శుభవార్తగా చెప్పవచ్చు. చాలా కార్ల ధరలు దిగివస్తాయి. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ.2.40 లక్షల వరకు తగ్గించినట్లు తెలిపింది. మరి ఏ మోడల్ కారుపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తాయని హ్యూందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. అదే రోజు నుంచే జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దసరా ఉత్సవాల ప్రారంభం నుంచి కార్ల ధరలు తగ్గుతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ మోటల్స్ పైన ధర తగ్గుతుందని తెలిపింది. ప్రస్తుతం ఇవి 18 శాతం పన్ను శ్లాబులోకి వస్తాయి. అంతకు ముందు ఇవి 28 శాతం జీఎస్టీ ప్లస్ 1 శాతం నుంచి 22 శాతం కాంపెన్సేషన్ సెస్ విధించే వారు. దీంతో ధరలు భారీగా ఉండేవి. అయితే ఈ పండగ సీజన్‌లో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో
గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై గరిష్ఠంగా రూ.73,808 ధర తగ్గనుంది.
ఐ20పై రూ.98,053 తగ్గుతుంది.
ఐ20 ఎన్ లైన్ కారుపై రూ.1,08,116 తగ్గుతుంది.
సెడాన్ వెహికల్స్‌లో
ఆరా మోడల్ కారుపై రూ. 78,465 తగ్గుతుంది.
హ్యూందాయ్ వెర్నా కారుపై రూ. 60,640 వరకు తగ్గుతుంది.
ఎస్‌యూవీ కార్లపై
హ్యూందాయ్ ఎక్స్‌టెర్ కారుపై రూ. 89,209 తగ్గుతుంది.
హ్యూందాయ్ వెన్యూ కారుపై రూ. 1,23,659 తగ్గిస్తోంది.
వెన్యూ ఎన్ లైన్ కారుపై రూ. 1,19,390 తగ్గుతోంది.
హ్యూందాయ్ క్రెటా కారుపై రూ. 72,145 తగ్గుతుంది.
క్రెటా ఎన్ లైన్ కారుపై రూ. 71,762 వరకు తగ్గుతుంది.
హ్యూదాయ్ అల్కాజర్ కారుపై రూ. 75,376 తగ్గుతుంది.
హ్యూందాయ్ టక్సన్ కారుపై అత్యధికంగా రూ. 2,40,303 మేర తగ్గించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa