రష్యాలోని తూర్పు తీర ప్రాంతమైన కమ్చట్కా ద్వీపకల్పం ఇటీవలి కాలంలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో అట్టుడుకుతోంది. నెల రోజుల క్రితం 7.4 తీవ్రతతో భారీ భూకంపం రాగా.. తాజాగా శనివారం రోజు కూడా 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమైందని జీఎఫ్‌జే తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా భూకంప కేంద్రానికి 300 కిలో మీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు "ప్రమాదకరమైన" సునామీ వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా దీనిపై సూచనలు జారీ చేసింది.
వరుస ఘటనలతో ఉలిక్కిపడిన కమ్‌చట్కా
తాజాగా సంభవించిన భూకంపం గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న విపత్తులలో ఒకటి మాత్రమే. కొన్ని రోజుల క్రితం ఇదే కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో అతి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం జపాన్, అలాస్కాలో చిన్నపాటి సునామీ అలలను సృష్టించింది. హవాయి, ఉత్తర-మధ్య అమెరికా, న్యూజిలాండ్‌తో సహా పసిఫిక్ ద్వీపాల్లో కూడా సునామీ హెచ్చరికలకు దారితీసింది. ఆ తర్వాత ఒక నెల వ్యవధిలోనే శనివారం మరో భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వరుస భూకంపాలకు కొద్ది రోజుల ముందు కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలైంది. వందల సంవత్సరాల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం 7.0 తీవ్రతతో కూడిన భూకంపాన్ని ప్రేరేపించిందని.. దీనితో కమ్చట్కాలోని మూడు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని పీటీఐ నివేదించింది. అయితే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలను తర్వాత ఉపసంహరించుకుంది.
క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఆకాశంలోకి 6 కిలో మీటర్ల ఎత్తు వరకు బూడిదను వెదజల్లిందని క్రొనొట్స్కీ రిజర్వ్ సిబ్బంది తెలిపారు. దట్టమైన బూడిద మేఘాలు అగ్నిపర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలను రాష్ట్ర మీడియా విడుదల చేసింది. "బూడిద తుంపరలు అగ్నిపర్వతం నుంచి తూర్పు వైపు పసిఫిక్ మహాసముద్రం వైపు వ్యాపిస్తున్నాయి. దాని మార్గంలో జనావాసాలు లేవు, నివాస ప్రాంతాలలో బూడిద పడలేదు" అని కమ్చట్కా అత్యవసర మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ సందేశంలో పేర్కొంది.
కమ్‌చట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అధిపతి ఓల్గా గిరినా.. "క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం 600 సంవత్సరాలలో విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి" అని రష్యన్ వార్తా సంస్థకు తెలిపారు. ఈ వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రజలలో తీవ్ర భయాందోళనలను సృష్టించాయి. ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉండటం వల్ల ఇలాంటి భౌగోళిక మార్పులు సాధారణమే అయినప్పటికీ.. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని పెద్ద సంఘటనలు జరగడం అరుదుగా చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa