ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని పోస్ట్ ఖాళీ లేదు.. 2047 వరకూ మోదీయే: రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 07:10 PM

రాబోయే సంవత్సరాల్లోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే బీజేపీని నడిపిస్తారని, అందులో ఎటువంటి సందేహం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.‘రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధానమంత్రి పదవికి ఖాళీ లేదు’ అని ఆయన ప్రకటించారు. 2029, 2034 ఎన్నికలు ఆ తర్వాత కూడా ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టూడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర రక్షణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1980ల నాటి నుంచి ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. ప్రజలతో మేమకం కావడం, సంక్లిష్ట సమస్యలను సులుభంగా పరిష్కరించడం, సంక్షోభ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా మోదీ అరుదైన సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు.


‘‘ప్రపంచంలోని అగ్రనేతలు కూడా ప్రపంచ విషయాలపై ఆయన సలహా తీసుకుంటారు.. పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ నాయకుల నుంచి ఇంత ఎక్కువగా వ్యక్తిగత ఫోన్ కాల్స్ అందుకుంటున్న మరో ప్రధానమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు’ అని సింగ్ అన్నారు. ప్రధాని మోదీ ఇటీవలే తన 75వ పుట్టిన రోజు జరుపుకోగా.. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ సహా ప్రపంచ దేశాధినేతల జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ గతంలో 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చి, సీనియర్లను పక్కనబెట్టింది. మరి ప్రధాని మోదీ విషయంలో ఎందుకు సడలించారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.


పహల్గామ్ ఉగ్రదాడికి తమ ప్రభుత్వ ప్రతిస్పందనే మోదీ పనితీరుకు ఉదాహరణ అని అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌‌లో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ ఇచ్చే ముందు త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారుతో ఏవిధంగా సంప్రదించారో రాజ్‌నాథ్ గుర్తుచేసుకున్నారు.


అంతేకాదు, 2013లో బీజేపీ ఎన్నికల కన్వీనర్‌గా, తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్ధిగా తమ పార్టీ ఎలా నిర్ణయించిందో వివరించారు. సీనియర్ నేత ఎల్కే అద్వాణీ అంటే తమకు గౌరవమని కానీ దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని కోరుకుందని తెలిపారు. ‘2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మేము ఆయన వెంట ఉన్నారు.. మోదీకి పూర్తి మెజార్టీ వస్తుందని నేను చెప్పేవాడ్ని.. కానీ, ఆయనకే అంత ఖచ్చితంగా తెలియదు’ అని అన్నారు. ఇదే సమయంలో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. అవన్నీ పూర్తి నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఒకవేళ, ఓట్ల చోరీపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు.


‘సమీప భవిష్యత్తులో ప్రధాన మంత్రి పదవి ఖాళీలేదు.. 2029, 2034, ఆ తర్వాత కూడా తమ ప్రధాని అభ్యర్థి మోదీయే’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తోన్న జర్నలిస్ 2044, 2047లోనూ మోదీ ఉంటారా? అని ప్రశ్నించగా.. అవును 2047లో వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa