ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపవాసం చేసిన సమయంలో తప్పక తాగాల్సిన డ్రింక్స్

Recipes |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 11:06 PM

నవరాత్రుల సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉంటారు. నిజానికి ఉపవాసం అనేది కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే చూడకూడదు. ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంతో మంచి చేస్తుంది. జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాస్తంత విరామం ఇచ్చినట్టుగా అవుతుంది. అంతే కాదు. జీర్ణ ప్రక్రియ మెరుగవడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అయితే..ఉపవాసం చేస్తున్నారు సరే. కానీ..ఆ సమయంలో అసలు ఎలా ఉంటున్నారు.


నీరసం రాకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉపవాసం అనేది ఎంత ఆరోగ్యకరమైనదే అయినా సరైన విధంగా ఆ సమయంలో శక్తి అందించకపోతే శరీరం బాగా నీరసం అయిపోతుంది. దీని వల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదముంటుంది. అందుకే..ఇప్పుడు చెప్పినట్టుగా ఉపవాసం ఉన్నప్పడు 5 రకాల డ్రింక్స్ తాగితే తక్షణమే ఎనర్జీ వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.


కొబ్బరి నీరు


​కొబ్బరి నీళ్లలో ఎన్ని పోషకాలుంటాయో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉందులో ఎలక్ట్రొలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి ఇన్ స్టంట్ గా ఎనర్జీ అందుతుంది. అందుకే..కాస్తంత నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా, ఇంకేదైనా అనారోగ్యం చేసి తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. డాక్టర్లు కూడా ఇదే సలహా ఇస్తారు. ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరానికి కావాల్సినంత మోతాదులో నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇది మరింత ప్రమాదకరం.


ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో ఎనర్జీని అందించే కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఉపవాసం సమయంలో తప్పక తీసుకోవాల్సిందే. కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉంటుంది. ఫలితంగా బాడీలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవుతాయి. పైగా గుండె, కిడ్నీల పని తీరు బాగుండాలన్నా ఈ నీరు ఎంతో తోడ్పడతాయి. కొబ్బరి నీరు తాగడం వల్ల నీరసం తగ్గుతుంది.


మజ్జిగ


కొబ్బరి నీళ్ల తరవాత ఆ స్థాయిలో శరీరానికి తక్షణమే శక్తినిచ్చేది మజ్జిగ. ప్రతి ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా జీర్ణం సరిగ్గా కానప్పుడు పల్చని మజ్జిగ తాగడం చాలా మందికి అలవాటు. అయితే..కేవలం ఇది జీర్ణ శక్తిని పెంచడమే కాదు. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పైగా మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ ఉండేందుకు సహకరిస్తుంది.


ఇదే సమయంలో తక్షణమే ఎనర్జీ అందించడంలోనూ సాయపడుతుంది. అయితే..కేవలం మజ్జిగ మాత్రమే తాగకుండా అందులో జీలకర్ర పొడి కలుపుకోవాలి. లేదా కాస్తంత ఉప్పు వేసుకుని తాగినా సరిపోతుంది. అయితే..ఉప్పుతో పాటు కొత్తిమీర కూడా కలిపితే చాలా మంచిది. కొత్తిమీరతో జీర్ణ శక్తి మెరుగవడంతో పాటు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఎక్కువ గంటల పాటు ఫాస్టింగ్ చేసినప్పుడు మజ్జిగ తాగడం మంచిది.


ఆమ్ పన్నా


పచ్చి మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ ఇది. దీన్నే ఆమ్ పన్నా అంటారు. రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసి ఈ జ్యూస్ తయారు చేసుకుంటారు. అయితే..కేవలం రుచి పరంగానే కాకుండా..డీహైడ్రేషన్ కాకుండా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు. కళ్లు తిరగడం, నీరసం, తలనొప్పి లాంటి వాటిని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా వడ దెబ్బ తగలకుండా చూస్తుంది. ఆమ్ పన్నాలో కావాల్సినంత విటమిన్ సి ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు జీర్ణ శక్తి కూడా మెరుగపడుతుంది. ఇందులో కాస్తంత నల్ల ఉప్పు, జీలకర్ర పొడి కూడా కలిపితే ఇంకాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నవరాత్రుల సమయంలో మధ్యాహ్నం పూట ఆమ్ పన్నా తాగడం చాలా మంచిది.


నిమ్మరసం


​నిమ్మరసం తాగడం చాలా మందికి అలవాటు. ఎవరైనా ఎక్కువ గంటల పాటు ఉపవాసం ఉండి, ఏమీ తినకుండా ఉంటే వాళ్లు నిమ్మరసం తీసుకుంటే చాలా మంచిది. అయితే..గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే తక్షణమే ఎనర్జీ వచ్చేస్తుంది. ఓ టీ స్పూన్ తేనె కూడా కలుపుకుంటే రుచి పెరుగుతుంది. అదే సమయంలో ఈ డ్రింక్ లో శక్తి కూడా పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పైగా ఇది బాడీ డిటాక్స్ లా పని చేస్తుంది. తేనె కలపడం వల్ల చాలా త్వరగా శరీరానికి శక్తి అందుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. పరగడుపున ఈ నీరు తీసుకుంటే కొద్ది గంటల పాటు ఎనర్జీ అలాగే ఉంటుంది. లేదా సాయంత్రం తీసుకున్నా మంచిదే. ఫాస్టింగ్ చేసినప్పుడు ఈ నీరు తీసుకుంటే బాడీ ఎనర్జీ పెరుగుతుంది. నీరసం అనిపించదు.


ఇవి కూడా ట్రై చేయండి


హెర్బల్ టీ తాగడం ద్వారా కూడా ఎనర్జీ పెంచుకోవచ్చు. ముఖ్యంగా అల్లం, తులసి, పుదీన లాంటివి ట్రై చేయాలి. ముఖ్యంగా బాడీ హైడ్రేట్ అవ్వాలంటే ఈ డ్రింక్స్ తీసుకోవాల్సిందే. పైగా ఈ హెర్బల్స్ లో రిలాక్సింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్స్ లో కఫైన్ ఉండదు. ఫలితంగా చాలా త్వరగా జీర్ణం అవుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ పై ఎలాంటి ప్రభావం పడదు. వీటిలో ఇన్ ఫ్లమేషన్ కూడా తక్కువే. తాగగానే రీఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. వేడిగా లేదా చల్లగా ఈ డ్రింక్స్ తీసుకున్నప్పుడు తక్షణమే శక్తి అందుతుంది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో చక్కెర వేసుకోకుండా కేవలం తేనె మాత్రమే వాడాలి. ఇలా ఉపవాస సమయంలో శరీరానికి కావాల్సినంత ఎనర్జీ ఇవ్వచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa