ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐరాస సర్వసభ్య సమావేశంలో మరోసారి పాత వ్యాఖ్యల పునరుద్ఘాటణ

international |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 06:03 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పాత వాదనను పునరుద్ఘాటించారు. ఇటీవల భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్రస్థాయికి చేరిన ఘర్షణను తానే నివారించానని, తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మంగళవారం ప్రసంగించిన ఆయన, ఈ ఘనత తనదేనని చెబుతూనే.. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై తన ఆవేదనను వెళ్లగక్కారు.ఐరాస ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన ట్రంప్, "నేను ఏడు యుద్ధాలను ముగించాను. అవన్నీ తీవ్రంగా కొనసాగుతున్నవే! వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో నేను జోక్యం చేసుకున్నాను" అని తెలిపారు. "అందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం కూడా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ వాదనను భారత్ ఇప్పటికే పలుమార్లు ఖండించింది. ఈ విషయంలో ట్రంప్ జోక్యం ఏమీ లేదని, ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల ద్వారానే సమస్య పరిష్కారమైందని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే జూన్‌లో జరిగిన ఫోన్ సంభాషణలో ట్రంప్‌కు స్పష్టం చేశారు. పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్‌కు ఫోన్ చేసి కాల్పుల విరమణకు అంగీకరించారని భారత వర్గాలు వెల్లడించాయి.ఇదే సమావేశంలో ట్రంప్భారత్, చైనాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు ఈ రెండు దేశాలు రష్యాకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు, రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న నాటో మిత్రదేశాలు, యూరోపియన్ యూనియన్‌పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "రష్యా యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధపడకపోతే, అమెరికా శక్తిమంతమైన సుంకాలను విధించడానికి సిద్ధంగా ఉంది. ఈ సుంకాలు ప్రభావవంతంగా ఉండాలంటే యూరప్ దేశాలు కూడా మాతో కలవాలి" అని ఆయన హెచ్చరించారు.ప్రపంచంలో శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్యసమితి పూర్తిగా విఫలమైందని ట్రంప్ దుయ్యబట్టారు. "ఈ పనులన్నీ ఐరాస చేయాల్సింది, కానీ నేనే చేయాల్సి వచ్చింది. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ సందర్భాల్లో ఐరాస కనీసం సాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు" అని ఆయన విమర్శించారు. తన ప్రసంగం మధ్యలో టెలిప్రాంప్టర్ ఆగిపోయినా, ట్రంప్ తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa