కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం.. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఇటీవల అక్కడ చేపట్టిన నిరసనలు.. హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింసలో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని అణిచివేసే చర్యలను తీసుకుంటోంది. హింసాత్మక నిరసనలు చెలరేగిన 2 రోజుల తర్వాత.. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్‌ను లడఖ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
లడఖ్ డీజీపీ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ నేతృత్వంలోని పోలీసుల బృందం మధ్యాహ్నం 2:30 గంటలకు సోనమ్ వాంగ్చుక్ ను అదుపులోకి తీసుకుంది. అయితే.. సోనమ్ వాంగ్చుక్‌పై ఎలాంటి ఆరోపణలు చేశారు అనేదానిపై ఇంకా పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బుధవారం లడఖ్‌లో జరిగిన అల్లర్లకు.. బీజేపీ కార్యాలయాన్ని స్థానికులు తగలబెట్టడానికి.. వాహనాలను దహనం చేయడానికి సోనమ్ వాంగ్చుక్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసనలు, నేపాల్‌లోని జెన్ జడ్ ఆందోళనలను ప్రస్తావిస్తూ.. సోనమ్ వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు లడఖ్ యువతను రెచ్చగొట్టినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలపై సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. లడఖ్‌లో చెలరేగిన హింసకు తనను బలిపశువు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. తనను అరెస్ట్ చేసి.. జైలుకు తరలిస్తే.. స్వేచ్ఛగా ఉన్న దానికంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ సమస్యలు రావచ్చని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.
సోనమ్ వాంగ్చుక్‌ను అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు.. ఆయన ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ అయిన సెకమాల్‌కు ఇచ్చిన ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) 2010 లైసెన్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అయితే ఈ లైసెన్స్ రద్దు చేయడానికి గల కారణాలుగా కేంద్రం.. పలు ఆర్థికపరమైన అవకతవకలను వెల్లడించింది. స్థానికంగా సేకరించిన నిధులను కూడా ఎఫ్‌సీఆర్ఏ ఖాతాలో జమ చేయడంతోపాటు.. విదేశీ నిధులను దేశ సార్వభౌమాధికారంపై అధ్యయనం వంటి అనుమతి లేని కార్యకలాపాలకు మళ్లించారని కేంద్రం ఆరోపించింది.
ఎఫ్‌సీఆర్ఏ అనుమతి లేకుండానే సోనమ్ వాంగ్చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ రూ.1.5 కోట్లకు పైగా విదేశీ నిధులను స్వీకరించడం వంటి ఆరోపణలు చేసింది. ఇక రూ.6.5 కోట్లను సోనమ్ వాంగ్చుక్ తన ప్రైవేట్ సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనమ్ వాంగ్చుక్‌పై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో.. ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘనలపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఆదాయ పన్ను అధికారులు కూడా ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ రక్షణ కోసం లడఖ్‌లో సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు నిరసనకారులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడంతో నిరసనకారుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. దీంతో శాంతియుత ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రస్తుతం లేహ్‌లో కర్ఫ్యూ విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa