ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇడ్లీ, దోశ పొట్లాల మాటున డ్రగ్స్ సరఫరా,,,హైదరాబాద్‌లో నయా గంజాయి దందా

Crime |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:12 PM

మహానగరంలో గంజాయి దందా కొత్త పుంతలు తొక్కుతోంది. పోలీసు యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. మత్తు ముఠాల ఆగడాలకు కళ్లెం వేయడం కష్టమవుతోంది. తనిఖీలకు పట్టుబడకుండా ఉండేందుకు నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ఇళ్లకు చేర్చే డెలివరీ బాయ్‌లను లక్ష్యంగా చేసుకుని వారికి ఎక్కువ కమీషన్ ఆశచూపి తమ సరఫరాదారులుగా మార్చుకుంటున్నారు.


ఈ దొంగ రవాణాలో అనుమానం రాకుండా ఉండేందుకు సరఫరాదారులు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. డెలివరీ బ్యాగు పైభాగంలో ఇడ్లీ, దోశ, బిర్యానీ వంటి ఆహార పొట్లాలను ఉంచి, అడుగున 60 నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను ఉంచి కొనుగోలుదారులకు చేరవేస్తున్నారు. ఇటీవల ఆహార పదార్థాలు సరఫరా చేసే ఓ డెలివరీ బాయ్ బ్యాగును పోలీసులు పరిశీలించగా.. దోశలు, ఇడ్లీ పొట్లాల మధ్యన గంజాయి ప్యాకెట్లు లభించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇదే తరహాలో మరో 20 మంది డెలివరీ బాయ్‌లు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి, ప్రస్తుతం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఈ ఏడాది మాదకద్రవ్యాల సరఫరా కేసుల్లో పోలీసులు ఇప్పటివరకు సుమారు 90 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి సెల్‌ఫోన్లలో దాదాపు 1000 మంది కొనుగోలుదారుల డేటాను గుర్తించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ప్రతి 100 మందిలో 99 మంది తొలుత మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారే కావడం గమనార్హం. వీరు ఉచితంగా మత్తు దొరకడంతో పాటు కమీషన్లకు ఆశపడి పెడ్లర్లుగా మారుతున్నారు. స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని గోవా, బెంగళూరు, ఏవోబీ, విశాఖపట్నం, నాగపూర్, బీదర్ వంటి ప్రాంతాలకు వెళ్లి గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు.


సంపాదనకు అడ్డదారి తొక్కే ఈ మత్తు ముఠాలను గుర్తించడం పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద సవాలుగా మారింది. లక్షలాది వాహనాలను తనిఖీ చేసి వీరిని పట్టుకోవడం కష్టతరంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అల్వాల్‌కు చెందిన ఒక బైక్ మెకానిక్.. పెళ్లయ్యాక అదనపు ఆదాయం కోసం బైక్‌ట్యాక్సీ నడపడం మొదలుపెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో మిత్రుడి సూచనతో తప్పటడుగు వేశాడు. నాగ్‌పూర్ వెళ్లి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి రెట్టింపు ధరకు విక్రయించడం ప్రారంభించాడు. కేవలం ఐదు నెలల్లోనే నలుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పెద్దఎత్తున దందా నడిపే స్థాయికి ఎదిగాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువకుడి వద్ద లభించిన గంజాయి ప్యాకెట్ల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు మత్తు లింకులను ఛేదించుకుంటూ వచ్చి చివరకు ఈ బైక్ మెకానిక్‌ను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa