భారతదేశంలో డయాబెటిస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి చికిత్స లేదు. ఒకసారి వ్యాధి బారిన పడిన తర్వాత మందులు, జీవనశైలి మార్పులతో దానిని నియంత్రించవచ్చు. ఇక, ఈ మహమ్మారి పెద్దలతో పాటు పిల్లల్ని కూడా ప్రభావితం చేసే వ్యాధిగా మారింది.
పిల్లల్లో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నందున, తల్లిదండ్రులు వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అయితే, ఏదైనా వ్యాధిని దాని లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ అనేది ముందుగానే గుర్తించగల వ్యాధి. దీన్ని గుర్తిస్తే రక్తంలో చక్కెర స్థాయిల్ని నిర్వహించవచ్చు. పిల్లల్లో టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నందున వాటి లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైప్ -2 డయాబెటిస్ ఉంటే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో డాక్టర్ వి మోహన్ చెప్పారు. ఆ లక్షణాలు తెలుసుకుందాం.
దాహం పెరగడం, తరచుగా మూత్ర విసర్జన
టైప్ 2 డయాబెటిస్ ఉన్న పిల్లలకు తరచుగా దాహం వేస్తుంటుంది. ఎందుకంటే వీళ్లు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటారు. దీంతో వాళ్లకి దాహం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే.. పిల్లల మూత్రపిండాలు గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువగా కష్టపడి పనిచేస్తాయి.
దీని వల్ల తరచుగా మూత్ర విసర్జనకి వెళ్తుంటారు. దీంతో దాహం వేస్తుంది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.
బరువు తగ్గడం
ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా లేదా సరిగ్గా తిన్న తర్వాత కూడా పిల్లల బరువు తగ్గుతుంటే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాలి. బరువు పెరగడంలో సమస్య ఉంటే అది పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ సంకేతం కావచ్చు. డయాబెటిస్ ఉన్న పిల్లలు చక్కెర నుంచి వచ్చే కేలరీల్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. దీంతో, వాళ్లు బరువు తగ్గడం ప్రారంభిస్తారు.
అలసట, బద్ధకం
పిల్లల్లో టైప్ - 2 డయాబెటిస్ అలసట, నీరసానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కణాలకు ఈ శక్తి అందదు. దీంతో అలసట, నీరసానికి దారి తీస్తుంది. చిన్న చిన్న పనులకే పిల్లలు అలసిపోతుంటే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాలని డాక్టర్ చెబుతున్నారు.
అస్పష్టమైన దృష్టి
పిల్లల్లో కంటి చూపు మందగించడం లేదా దృష్టి మసకబారడం కూడా టైప్ - 2 డయాబెటిస్ లక్షణం. ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిల వల్ల వస్తుంది. పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి
పిల్లలలో గాయాలు నెమ్మదిగా మానడం లేదా తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల గాయాలు నయం కావడం కష్టమవుతుంది.
టైప్ 2 డయాబెటిస్ వల్ల పిల్లల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. మెడ, చేతులు, నడుము చుట్టూ నల్లటి మచ్చలు డయాబెటిస్‌కు సంకేతం. అకాంథోసిస్ నైగ్రికన్స్ అని కూడా పిలువబడే ఈ పరిస్థితి శరీరంలో ఇన్సులిన్ నిరోధకత వల్ల వస్తుంది.
పిల్లలు తరచుగా ఆకలిగా ఉండటం టైప్ 2 డయాబెటిస్ లక్షణం.ఇన్సులిన్ నిరోధకత కారణంగా పిల్లల శరీరాలు శక్తిని ఉత్పత్తి చేయడానికి గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. దీంతో వాళ్లు తిన్న తర్వాత కూడా ఆకలిగా ఉంటారు.
టైప్ -2 డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలు
పిల్లలకు టైప్ 2 డయాబెటిస్ వస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటిలో అధిక కొలెస్ట్రాల్, గుండె, రక్తనాళాల వ్యాధి, నరాల దెబ్బతినడం, స్ట్రోక్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి. అలాగే, అంధత్వం వంటి కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa