దేశవ్యాప్తంగా సామాన్య పౌరులను వణికిస్తున్న వీధి కుక్కల దాడుల సమస్యపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో భాగంగా.. "ఒక కుక్క కరిచే మూడ్‌లో ఉందో లేదో అని దాని మనసును ఎవరూ చదవలేరు" అని ధర్మాసనం అభిప్రాయపడింది. కుక్క కాటు వంటి సంఘటనల్లో చికిత్స కంటే నివారణే ఉత్తమం అని కోర్టు స్పష్టం చేసింది. గత కొంతకాలంగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కుక్కల దాడులు విపరీతంగా పెరగడం పట్ల న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
గత నవంబర్‌లో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాల వంటి చోట్ల కుక్కల దాడులు పునరావృతం కావడం అనేది పాలనాపరమైన ఉదాసీనతే అని తెలిపింది. అలాగే వ్యవస్థాగత వైఫల్యమని కూడా కోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలను వెంటనే పట్టుకుని నిర్ణీత షెల్టర్ హోమ్‌లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అలాగే అక్కడే వాటికి సక్రమంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అత్యంత ముఖ్యంగా.. ఒకసారి పట్టుకున్న కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదిలి పెట్టకూడదని కోర్టు నిబంధన విధించింది.
గతేడాది జూలైలో ఢిల్లీ. దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పును ఇచ్చింది. వీధి కుక్కల వల్ల రేబిస్ మరణాలు పెరుగుతున్నాయని.. అందువల్ల నివాస ప్రాంతాల నుంచి కుక్కలను షెల్టర్లకు తరలించడం తప్పనిసరని పేర్కొంది. కుక్కలను పట్టుకునే ప్రక్రియను అడ్డుకునే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి పశువులు, ఇతర వీధి జంతువులను తొలగించాలని కూడా సూచించింది.
కుక్కలకు ఆహారం పెట్టే విషయంలోనూ కోర్టు స్పష్టత ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆహారం వేయడం వల్ల కుక్కల గుంపులు పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అందుకే మున్సిపల్ అధికారులు కుక్కలకు ఆహారం అందించడానికి ప్రత్యేకంగా 'ఫీడింగ్ స్పేస్'లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ముఖ్యంగా పిచ్చి కుక్కలు లేదా విపరీతమైన దూకుడు ప్రదర్శించే కుక్కల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించింది. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే.. ఈ సమస్యను మానవీయ కోణంలో ఎలా పరిష్కరించాలో సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa