భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు.301 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆరో ఓవర్లో మొదటి సిక్స్ కొట్టిన రోహిత్, ఆ తర్వాతి ఓవర్లో కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్ బాది రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే, ఈ మెరుపు ఆరంభాన్ని రోహిత్ భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఓపెనర్‌గా క్రిస్ గేల్ 328 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, తాజా మ్యాచ్‌లో రోహిత్ (329) ఆ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది దక్షిణాఫ్రికా సిరీస్‌లో షాహిద్ అఫ్రిది రికార్డును బ్రేక్ చేసి, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే.ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ శుభారంభం అందించగా, డారిల్ మిచెల్ రాణించాడు. భారత బౌలర్లు చివర్లో పుంజుకుని కివీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa