కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్య భద్రత కల్పిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు, ప్రచార కార్యక్రమాలకు అవసరమైన నిధుల మద్దతును కూడా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో 2015 మే 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో చేరిన వారు చెల్లించే చందాను బట్టి, 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు కనీస గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో పెన్షన్ తీసుకునే వారి సంఖ్యను పెంచడం, ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, 'వికసిత భారత్ @2047' లక్ష్య సాధనకు తోడ్పడటం ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఈ ఏడాది జనవరి 19 నాటికి ఈ పథకంలో 8.66 కోట్లకు పైగా చందాదారులు చేరారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తుండగా, మొత్తం నమోదులలో 70.44 శాతం వాటాను అవే కలిగి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి నాటికి ఈ స్కీమ్‌లో కొత్తగా చేరే వారి సంఖ్య 24 శాతం వృద్ధిని సాధించి, ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa