స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ గమనాన్ని శాసించే అపర కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు లక్ష్యంగా కేటుగాళ్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. అతిరథ మహారథులు హాజరయ్యే ఈ వేదికను అడ్డం పెట్టుకుని స్కామర్లు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇలాంటి చోట్ల కూడా మోసగాళ్లు చొరబడటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామంటూ ఈ మోసాలకు తెరలేపారు. 'USA హౌస్'లోకి వీఐపీ ఎంట్రీ ఇప్పిస్తామని, అక్కడ నేరుగా అధ్యక్షుడిని కలిసే వీలుంటుందని నమ్మబలుకుతూ నకిలీ టికెట్లను విక్రయిస్తున్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తులకు మాత్రమే పరిమితమైన యాక్సెస్‌ను తాము ఇప్పించగలమని నమ్మించి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మాయమాటలు నమ్మి ఇప్పటికే కొందరు బిలియనీర్లు మోసపోయినట్లు తెలుస్తోంది.
ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో ‘USA హౌస్’ ప్రతినిధులు తక్షణమే స్పందించారు. తాము అధికారికంగా ఇలాంటి టికెట్లు లేదా విక్రయాలు జరపడం లేదని స్పష్టం చేస్తూ, ప్రముఖులకు హెచ్చరికలు జారీ చేశారు. కేటుగాళ్ల ఉచ్చులో పడి అపరిచిత వ్యక్తుల నుంచి పాస్‌లు కొనుగోలు చేయవద్దని సూచించారు. "దురదృష్టవశాత్తూ మోసపోయిన వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాము" అంటూ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనే వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి హై-ప్రొఫైల్ మోసాలు జరగడం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. టెక్నాలజీ సాయంతో నకిలీ ఇన్విటేషన్ కార్డులను, టికెట్లను అచ్చం అసలు వాటిలాగే సృష్టించి మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక మార్గాల ద్వారానే భేటీలకు ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa