ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యతరగతికి ఈసారి 'బడ్జెట్లో' నిరాశే.. పన్ను మినహాయింపులు కష్టమేనంటున్న నిపుణులు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 11:21 PM

కేంద్ర బడ్జెట్ అనగానే సగటు వేతన జీవి ఆశలన్నీ ఆదాయపు పన్ను మినహాయింపుల చుట్టూనే తిరుగుతుంటాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2026పై కూడా అవే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈసారి మధ్యతరగతి ప్రజలకు పెద్దగా పన్ను ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. దేశ ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను బట్టి చూస్తే, భారీ మార్పులు ఉంటాయని ఆశించడం అత్యాశే అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


నిపుణుల అభిప్రాయం ప్రకారం వచ్చే బడ్జెట్ 2026లో భారీ పన్ను ఊరట ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్థిక లోటును తగ్గించే లక్ష్యం. ప్రభుత్వం తన ఆర్థిక లోటును తగ్గించుకోవాలని పట్టుదలగా ఉంది. గతేడాది పన్ను స్లాబ్‌లను భారీగా తగ్గించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలంటే, ప్రస్తుతానికి పన్నుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది.


ఇక రెండోది కొత్త పన్ను విధానం పై ఫోకస్. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను పాత విధానం నుంచి కొత్త పన్ను విధానం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. గత బడ్జెట్‌లలోనే కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వంటి మార్పులు చేశారు. కాబట్టి, ఈసారి మళ్లీ భారీ మార్పులు చేసి గందరగోళం సృష్టించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది.మూడోది మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు. రైల్వేలు, రోడ్లు, డిఫెన్స్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యయాల కోసం నిధులు అవసరం కావడంతో, పన్ను ఆదాయాన్ని వదులుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని నిపుణులు వివరిస్తున్నారు.


గత ఏడాదే కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ద్వారా పన్ను లేకుండా చేశారు. ఇది ఇప్పటికే మెజారిటీ చిన్న ఆదాయ వర్గాలకు మేలు చేస్తోందని, కాబట్టి మరోసారి స్లాబ్‌లను మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. 'పన్ను చెల్లింపుదారులు కనీసం 80C పరిమితి పెంపు లేదా గృహ రుణ వడ్డీపై అదనపు మినహాయింపులు ఆశిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వీటిపై మొగ్గు చూపే అవకాశం తక్కువ. ద్రవ్యోల్బణం దృష్ట్యా చిన్నపాటి మార్పులు ఉండొచ్చు కానీ, పెద్ద మొత్తంలో ట్యాక్స్ సేవింగ్స్ ఆశించడం కష్టమే' అని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.


మొత్తానికి, బడ్జెట్ 2026లో మధ్యతరగతి ప్రజలకు ఏదైనా 'సర్ ప్రైజ్' లభిస్తుందా లేదా అనేది ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే నిపుణుల అంచనాలు మాత్రం ఆశాజనకంగా లేవు. గతేడాది బడ్జెట్‌లోనే ఊహించని విధంగా పన్ను విధానాల్లో మార్పులు చేశారు. అందుకే ఇప్పుడు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని గట్టిగా విశ్వసిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa