దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించడంలో దక్షిణ కొరియా శాసనసభ విఫలమైందని ఆరోపిస్తూ.. ఆ దేశ ఎగుమతులపై టారిఫ్‌లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఆందోళన మొదలైంది.తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఈ మేరకు పోస్ట్ చేసిన ట్రంప్, సుంకాలను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్స్, కలప, ఫార్మా ఉత్పత్తులతో పాటు పలు ఇతర వస్తువులకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. "అమెరికాతో చేసుకున్న ఒప్పందానికి దక్షిణ కొరియా కట్టుబడి ఉండటం లేదు. వారి శాసనసభ ఎందుకు దానిని ఆమోదించలేదు?" అని ట్రంప్ ప్రశ్నించారు. అయితే, సోమవారం రాత్రి వరకు ఈ పెంపునకు సంబంధించి వైట్‌హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.ట్రంప్ ఆకస్మిక ప్రకటనపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం (చియాంగ్ వా డే) స్పందించింది. టారిఫ్‌ల పెంపుపై తమకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు అధ్యక్ష విధాన డైరెక్టర్ కిమ్ యోంగ్-బియోమ్ మంగళవారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించినట్లు వెల్లడించింది. అలాగే, కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య మంత్రి కిమ్ జంగ్-క్వాన్ వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లి వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్‌తో చర్చలు జరపనున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa