ప్రస్తుత కేంద్ర బడ్జెట్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. దేశ ప్రజలు ఆశిస్తున్న వేగవంతమైన ఆర్థిక వృద్ధికి (Fastest Growing Economy) ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అన్ని వర్గాలను సమతూకంలో ఉంచుతూ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన కొనియాడారు.
ఈ బడ్జెట్లో ముఖ్యంగా రైతులు, మహిళలు మరియు యువతకు పెద్దపీట వేయడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే, యువతకు ఉపాధి కల్పించే మాన్యుఫ్యాక్చరింగ్ మరియు MSME రంగాలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల పారిశ్రామిక రంగం ఊపందుకోవడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలకు కొత్త ఊపిరి పోసినట్లవుతుందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ వల్ల చేకూరే ప్రయోజనాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సమూలంగా మార్చే హైస్పీడ్ రైళ్ల రాక, పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన 'రేర్ ఎర్త్ కారిడార్లు' ఏపీ రూపురేఖలను మార్చబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం చూపుతున్న చొరవ రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడుతుందని, ఏపీ పురోగతికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధి లక్ష్యంగా ఇటువంటి సాహసోపేతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వినూత్న పథకాలు, సంస్కరణల ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందుతాయని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa