విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై వస్తున్న విమర్శలను ఆ సంస్థ ప్రెసిడెంట్, ఎంపీ భరత్ తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే గీతంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతోనే యూనివర్సిటీ ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేశారని, ఇప్పుడు కూడా అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని భరత్ విమర్శించారు.
భూముల విలువలపై జరుగుతున్న ప్రచారాన్ని భరత్ గణాంకాలతో సహా తిప్పికొట్టారు. 2024 నాటి రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం 54.79 ఎకరాల భూమి విలువ సుమారు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే కేవలం ఏడాది కాలంలోనే ఈ భూమి ధర ఐదు రెట్లు పెరిగిందని చెప్పడం ఏమాత్రం హేతుబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ ధరలు మరియు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయించే ధరకు తాము కట్టుబడి ఉన్నామని భరత్ కీలక ప్రకటన చేశారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించినా ఆ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎప్పుడూ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై భరత్ ఎదురుదాడికి దిగారు. సుమారు 1100 కోట్ల రూపాయల విలువ చేసే 11 ఎకరాల భూమిని టి.ఎస్.ఐ.బి (TSIB) కి కేవలం 11 కోట్ల రూపాయలకే జగన్ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విలువైన భూములను నామమాత్రపు ధరలకే కట్టబెట్టిన వారు, ఇప్పుడు గీతం సంస్థపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa