ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ దిశగా అడుగులు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 05:17 PM

రాష్ట్రంలో మంత్రుల పనితీరు కేవలం ఫైళ్లు చూడటం మరియు పాలసీలు రూపొందించడానికే పరిమితం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై సామాజిక మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న జనాభా గమనగతులను దృష్టిలో ఉంచుకుని, మంత్రులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని ఆయన క్లాస్ తీసుకున్నారు.
రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటుపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, జనాభా పెరుగుదలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. గర్భనిరోధక శస్త్రచికిత్సల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు జనాభా ప్రాముఖ్యతను వివరించాలని ఆయన మంత్రులకు సూచించారు. దక్షిణ భారతదేశంలో మారుతున్న డెమోగ్రాఫిక్ పరిస్థితుల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌లో యువత సంఖ్యను స్థిరంగా ఉంచడం ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’పై ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఒక సమగ్రమైన పాలసీని ప్రకటించనుందని చంద్రబాబు వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా జనాభా పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనాభా నిర్వహణ అనేది కేవలం ఒక సంఖ్య కాదని, అది రాష్ట్ర మనుగడకు సంబంధించిన అంశమని పేర్కొంటూ, త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించనున్నట్లు ఆయన మంత్రులకు వివరించారు.
వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జనాభా నియంత్రణ కంటే జనాభా సమతుల్యత (Population Balance) ముఖ్యం అని భావిస్తున్న ప్రభుత్వం, ఏప్రిల్ నుంచి కొత్త పాలసీ కార్యాచరణను పట్టాలెక్కించనుంది. రానున్న రోజుల్లో ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రంలో ఎలాంటి సామాజిక మార్పులు వస్తాయోనన్న చర్చ ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa