మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం విమర్శించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ఆయన ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా, తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. భద్రతా బృందానికి గానీ, పార్టీ ప్రతినిధులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు. ఆ మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని తలశిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రొటోకాల్స్‌ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైయస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa