ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 4న ప్రధాన మంత్రి ప్రసంగం రద్దు.... సంచలన వీడియో బయటపెట్టిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 09:29 PM

లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్ష సభ్యులు దాడిచేయొచ్చని, అందుకే సభకు రావద్దని తాను ప్రధానికి సూచించినట్టు స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రకటన కలకలం రేపింది. విపక్షాల నిరసనలతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగం రద్దయినట్టు లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం గమనార్హం. లోక్‌సభలో ఫిబ్రవరి 4న కాంగ్రెస్‌ మహిళా ఎంపీల అవమానకరమైన ప్రవర్తనను చూసి ఆ పార్టీ నాయకులు గర్వపడుతున్నారని రిజిజు ఎద్దేవా చేశారు.


 ఆ సమయంలో వారిని తాము అడ్డుకోకపోయి ఉంటే అక్కడి పరిస్థితి చేయిదాటిపోయేదని కేంద్ర మంత్రి అన్నారు. పార్లమెంట్‌ గౌరవం, పవిత్రతను కాపాడటానికి బీజేపీ ఎంపీలు సహనంతో ఉండాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘‘గౌరవనీయ ఎంపీల ఇటువంటి ప్రవర్తనను ఎవరు సమర్థించగలరు? మనం సభ గౌరవాన్ని కాపాడుకోవాలి.. ఏ బీజేపీ ఎంపీ కూడా దురుసుగా ప్రవర్తించే ప్రతిపక్ష ఎంపీలతో ఘర్షణకు దిగకూడదు అని మా నాయకత్వం నుంచి వచ్చిన దిశానిర్దేశం చాలా స్పష్టంగా ఉంది...’’ అని రిజిజు ట్వీట్ చేశారు.


అయితే, కాంగ్రెస్‌ ఎంపీలు బ్యానర్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని సీటు దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్న దృశ్యాలు రిజిజు షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో వారిని అక్కడ నుంచి వెళ్లాలని కేంద్ర మంత్రులు రిజిజు, గిరిరాజ్‌ సింగ్‌లు కోరినప్పటికీ విపక్ష సభ్యులు కదలడానికి నిరాకరించడం స్పష్టంగా రికార్డయ్యింది. కాగా, ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న విపక్ష నేత రాహుల్ గాంధీ.. మాజీ ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించడంతో రగడ మొదలైన సంగతి తెలిసిందే.


ఫిబ్రవరి 4న ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళనతో గందరగోళం మొదలైంది. అనంతరం పలుసార్లు వాయిదాలు పడినరేంద్ర మోదీ ప్రసంగం రద్దు కావడానికి దారితీసింది. ఆ మర్నాడు స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు ప్లాన్‌ చేసినట్లు ముందే తనకు సమాచారం ఉందని అన్నారు. భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే ప్రధాన మంత్రికి సూచించానని చెప్పారు. సభలో ప్రధాని లేనప్పటికీ విపక్ష ఎంపీలు ఆయన సీటు దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం వల్లే వాయిదా వేసినట్టు ఓం బిర్లా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa