ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ కార్డుల రూపురేఖలు మార్చేందుకు యూఐడీఏఐ సన్నాహాలు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 06:16 AM

దేశవ్యాప్తంగా కోట్లాది మంది గుర్తింపు కార్డుగా మారిన ఆధార్ కార్డు స్వరూపంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఆధార్ కార్డు ఫోటోకాపీల ద్వారా జరుగుతున్న మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, భౌతిక ఆధార్ కార్డుపై ఇకపై వ్యక్తిగత వివరాలు కనిపించవు.ప్రస్తుతం మనం బ్యాంకు ఖాతా తెరిచేందుకు, సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ కార్డు ఫోటోకాపీలను ఇస్తున్నాం. ఈ కార్డులపై 12 అంకెల ఆధార్ నంబర్‌తో పాటు పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి అత్యంత సున్నితమైన సమాచారం ముద్రించి ఉంటోంది. ఈ ఫోటోకాపీలు నేరగాళ్ల చేతికి చిక్కితే గుర్తింపు చోరీ (ఐడెంటిటీ థెఫ్ట్), ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని యూఐడీఏఐ గుర్తించింది.ఈ సమస్యను అధిగమించేందుకు, కొత్తగా జారీ చేయబోయే ఆధార్ కార్డులపై కేవలం కార్డుదారుడి ఫోటో, ఒక ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ మాత్రమే ప్రదర్శించాలని యూఐడీఏఐ యోచిస్తోంది. ఆధార్ నంబర్, చిరునామా వంటి వివరాలన్నీ ఈ క్యూఆర్ కోడ్‌లో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. గుర్తింపు ధృవీకరణ అవసరమైనప్పుడు, సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న అధీకృత యాప్‌ల ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలను సరిచూసుకుంటాయి. దీనివల్ల కేవైసీ ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా, వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత లభిస్తుంది.గత ఏడాది నుంచే ఈ మార్పులపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది. ఆధార్ ఫోటోకాపీల ద్వారా జరిగే దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ ఇటీవలే ఒక సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల విడుదల చేసిన కొత్త ఆధార్ మొబైల్ యాప్‌లో కూడా లాగిన్ అయిన తర్వాత కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించేలా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన అమలైతే ఆధార్ గోప్యత మరింత పటిష్ఠం అవుతుందని, మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa