ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది.మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు ఇచ్చే అవకాశం లభిస్తుంది. బంజరు లేదా చౌడు భూములుగా ఉండి సాగుకు పనికిరాని అసైన్డ్ భూములకు ఈ లీజు ద్వారా భరోసా లభిస్తుంది. ఎకరాకు ఏడాదికి రూ. 31 వేల లీజు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5 శాతం మేర పెంచుతూ చట్టంలో సవరణ చేశారు.అసైనీదారుల పూర్తి అనుమతితోనే భూములు తీసుకుంటారు. ట్రై-పార్టీ అగ్రిమెంట్ (త్రిపక్ష ఒప్పందం) ద్వారా లబ్ధిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఈ చట్టంతో రాష్ట్రంలో సుమారు రూ. 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.గ్రామ వార్డు స్థాయి పాలనలో మార్పులు తీసుకువస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై 'స్వర్ణ గ్రామం' మరియు 'స్వర్ణ వార్డు' సచివాలయాలుగా పిలుస్తారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa