ఇరాన్ నౌక IRIS 'దేనా'పై దాడి జరిగిన నేపథ్యంలో, భారత్ ఆ నౌకకు రక్షణ కల్పించలేకపోయిందనే విమర్శలు సోషల్ మీడియాలోనూ, కొన్ని అంతర్జాతీయ వర్గాల్లోనూ వినిపించాయి. అయితే, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే భారత్ మొదటి నుంచీ ఇరాన్‌కు స్నేహపూర్వక సహకారాన్ని అందిస్తూనే ఉందని స్పష్టమవుతోంది. దేనా విషయంలో తలెత్తిన వివాదం కేవలం సాంకేతిక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిందే తప్ప, భారత్ ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గలేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ తన స్నేహహస్తాన్ని చాటుతుందనడానికి నిదర్శనం కొచ్చి పోర్టులో సురక్షితంగా ఉన్న మరో ఇరాన్ నౌక IRIS 'లవన్'. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న ఈ నౌక, ప్రస్తుతం భారత నౌకాదళం పర్యవేక్షణలో భద్రంగా ఉంది. ఇరాన్‌పై అమెరికా దాడులు జరిగిన ఫిబ్రవరి 28వ తేదీనే, లవన్ నౌక సాంకేతిక సమస్యల కారణంగా భారత దేశ సహాయాన్ని అర్థించింది. వెంటనే స్పందించిన భారత అధికారులు, ఆ నౌకను సముద్ర మధ్యలో వదిలేయకుండా కొచ్చి పోర్టుకు చేర్చి తగిన ఆశ్రయం కల్పించారు.
దాదాపు 183 మంది సిబ్బందితో కూడిన IRIS లవన్‌కు భారత్ ఆశ్రయం కల్పించడం ద్వారా, అంతర్జాతీయ విపత్కర పరిస్థితుల్లో కూడా తన దౌత్యనీతిని నిలబెట్టుకుంది. ఇరాన్‌కు భారత్ సహకరించడం లేదన్న వాదనలను ఈ పరిణామం పూర్తిగా పటాపంచలు చేస్తోంది. అత్యవసర సమయంలో ఒక విదేశీ నౌకకు, అందులోని సిబ్బందికి రక్షణ కల్పించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా తన ముద్ర వేసింది.
అసలు వివాదానికి కారణమైన 'దేనా' నౌక విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇరాన్ నుండి ఎటువంటి అధికారిక అభ్యర్థన అందలేదని సమాచారం. సాధారణంగా ఏదైనా దేశం సహాయం కోరితేనే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. దేనా విషయంలో రిక్వెస్ట్ లేకపోవడం వల్లే భారత్ స్పందించలేదని, అదే సమయంలో సహాయం కోరిన 'లవన్'కు మాత్రం వెనువెంటనే అండగా నిలిచామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa