అక్టోబర్‌లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని 5జీలోనూ టెలికాం సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్విప్‌మెంట్‌ను నెలకొల్పే ప్రక్రియను ప్రారంభించాలని తాము పరిశ్రమను కోరామని చెప్పారు. 5జీ స్పెక్ట్రం వేలం ఇటీవలే ముగిసిందని, స్పెక్ట్రం కేటాయింపులను ఆమోదించేందుకు తమ కమిటీ సమావేశమైందని అన్నారు.
ప్రపంచంలోనే భారత టెలికాం మార్కెట్ అత్యంత అందుబాటు ధరల్లో సేవలందించే మార్కెట్ అని కేంద్ర మంత్రి తెలిపారు. 5జీ సేవలు వచ్చినా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ముప్పు పెరుగుతుందనే వార్తలను మంత్రి తోసిపుచ్చుతూ మన వద్ద రేడియేషన్ లెవెల్ అమెరికా, యూరప్‌తో పోలిస్తే పది రెట్లు తక్కవని వివరించారు. లో రేడియేషన్ అంటే మనం మెరుగైన నాణ్యమైన సేవలను అందించే సామర్ధ్యం కలిగిఉన్నామనేందుకు సంకేతమని తెలిపారు.
5జీ సేవలు ప్రారంభం కాగానే 5జీ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భారత్‌లో తయారయ్యే 25 నుంచి 30 శాతం మొబైల్ ఫోన్లు 5జీ కనెక్టివిటీ కలిగినవని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రతి ఏటా 5జీ మొబైల్ ఫోన్‌ల ధరలు దిగివస్తున్నాయని అన్నారు. ఏడాది వ్యవధిలో 5జీ ఆధారిత ఫోన్లు అధికంగా ఉంటాయని చెప్పారు.