ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు జీఏడి సమాచారం అందించింది. అయితే, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతన్న ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు..సచివాలయాల కు నిధుల మంజూరు పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ సమయంలో పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం... పునరావాస ప్యాకేజీ పైన మరోసారి అభ్యర్ధించారు. ఇప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాకుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం.. పునారావాస అంశాల పైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా.. మూడు రాజదానుల విషయంలోనూ వైసీపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.