పరామర్శకు వెళ్లకూడదని ఏ చట్టం చెబుతోందని ఏపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పలాస పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఇతర నేతలను నిర్బంధించడంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. అరెస్టులు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వెళ్తున్నా జగన్ భయపడుతున్నారని అన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులు, ఆంక్షలు ఎవరి కోసమో ప్రభుత్వం చెప్పాలన్నారు. అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజలు ప్రశ్నించడాన్ని అరెస్టులు అడ్డుకోలేవని నిప్పులు చెరిగారు. పలాసలో రాజకీయ కక్షతో తప్పులు చేశారు కాబట్టే జగన్ ప్రభుత్వం ఇలా వణికిపోతోందని అన్నారు. పరామర్శకు వెళ్లకూడదని ఏ చట్టం చెబుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.
మరోవైపు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. శుభకార్యానికి వెళ్తున్న తమను అడ్డుకుని నిర్బంధించడం దారుణమన్నారు. ప్రతిపక్షాల నోళ్లు నొక్కి వారిని అణగదొక్కాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలు బయటపడతాయనే తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ నియంత ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.