పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు జారీకి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ మయూర్ అశోక్ ఆదేశించారు. సింగల్ డెస్క్ పోర్టల్ పర్యవేక్షణకు ప్రతి విభాగం నుంచి ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలని సూచించారు. ఈఓడీబీలో విజయనగరం జిల్లా మొదటి ర్యాంకులో ఉందని, దీనిని కొనసాగేలా చూడాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరిశ్రమల ఏర్పాటు కోసం గుర్తించిన భూములను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజుకు సూచించారు. భోగాపురంలో ఆపెక్స్ హేచీస్ యూనిట్ స్థాపనకు కేటాయించాల్సిన భూములను తహసీల్దార్ కలిసి పరిశీలించాలన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారికి సూచించారు. వివిధ యూనిట్ల స్థాపనకు 32 దరఖాస్తులు అందగా, 15 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్టు పరిశ్రమల జనరల్ మేనేజర్ పాపారావు తెలిపారు.