భారత మార్కెట్ లోకి తాజాగా పేరు మోసిన కంపెనీల స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ రెడ్ మి సబ్ బ్రాండ్ కింద కొత్త ఫోన్ ‘రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ’ను మార్కెట్లోకి తేనుంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ ఫోన్ ను ఇండియాలో ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ ను ఎప్పటి నుంచి విక్రయించేదీ, ఏయే మోడళ్లు అందుబాటులో ఉండేదీ ఆ రోజున వెల్లడించనుంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించి షియోమీ సంస్థ అధికారికంగా కొన్ని వివరాలే వెల్లడించినా.. ఉద్యోగ వర్గాల నుంచి, ఐఎంఈఐ సీరియల్ నంబరింగ్ కోసం చేసుకున్న దరఖాస్తు వివరాల నుంచి మరికొన్ని వివరాలు లీకైనట్టు టెక్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఈ ఫోన్ ప్రత్యేకతలను వెల్లడించాయి.
ఈ ఫోన్ లో రెండు సిమ్ లు కూడా 5జీని సపోర్టు చేసే సదుపాయం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏ సిమ్ ను అయినా 5జీ నుంచి 4జీ, జీఎస్ఎం వంటివాటికి మార్చుకోవచ్చు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ చిప్ సెట్ ను అమర్చారు. 4 జీబీ ర్యామ్ నుంచి 8 జీబీ ర్యామ్ వరకు మోడళ్లు అందుబాటులో ఉండనున్నాయి. 6.5 అంగుళాల టియర్ డ్రాప్ (నీటి బిందువు ఆకారంలోని ఫ్రంట్ కెమెరా) ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ తో డిస్ ప్లేతో ఉండనుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న లిథియం పాలిమర్ జంబో బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ను అమర్చారు. ఈ ఫోన్ ప్రాథమికంగా రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. షియోమీ సంస్థ సబ్ బ్రాండ్ అయిన పోకో ఎం5 5జీ మోడల్ ను రీబ్రాండ్ చేసి రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ కింద విడుదల చేస్తున్నట్టుగా టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 6న షియోమీ సంస్థ అధికారికంగా రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్ ను ఆవిష్కరించి, పూర్తి ఫీచర్లను ప్రకటించనుంది. ఆ తర్వాత వివిధ ఆన్ లైన్, ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.