‘సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27 సంవత్సరాలు అయ్యిందట. దాన్ని పండగ చేసుకుంటున్నాడు అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేసారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... 27 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచి.. ఆ పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి పండగ చేసుకుంటూ.. మళ్లీ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు.
సెప్టెంబర్ 2వ తేదీ వైయస్‌ఆర్ వర్ధంతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం అంటూ చంద్రబాబు డ్రామా మొదలుపెట్టాడు. మనసున్న మనిషి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయి.. 13 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆయన్ను గుండెల్లో పెట్టుకొని సెప్టెంబర్ 2వ తేదీన ఆ మహనీయుడికి ఊరువాడా, ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పిస్తారు.
5 సంవత్సరాల 3 నెలల కాలమే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మహోన్నత కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువయ్యారు. ఆ మహనీయుడి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు వంటి పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదు’ అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు.