ఏపీలో టీచర్లపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు టీచర్స్ డేను బహిష్కరించారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసినప్పటికీ ఏపీ సర్కార్ మాత్రం టీచర్లపై అక్రమ కేసులు పెట్టిందని, అందుకే ఎల్లుండి జరిగే సత్కారాలు, సన్మానాలను చేసుకోకూడదని ఏపీటీఎఫ్ నిర్ణయించింది. ఏపీ సర్కార్ పాలనలో అవమానాల పాలవుతున్న ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని కోరింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది.ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు వెళ్లడం లేదని, పూర్తి సమయం వరకు పాఠశాలలో ఉండడం లేదని పేర్కొంటూ ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చి అమలు చేస్తుంది . ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. చివరకు ప్రభుత్వం చేసిన స్వల్ప మార్పులతో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. చలో విజయవాడను అడ్డుకునేందుకు ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేసింది. ఉద్యోగులను బైండోవర్లు చేయడం, నోటీసులు పంపించడం లాంటి చర్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి . ఈ సమయంలో ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.