ఒక్కోసారి శరీరం తీవ్ర నిస్సత్తువకు గురవుతుంది. బాగా నీరసంగా ఉండి, ఏ పనీ చేయడం సాధ్యపడదు. ఇలాంటి సమయంలో సగ్గుబియ్యం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి, రక్తపోటును నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సగ్గుబియ్యం సాయపడుతుంది. ప్రతి 100 గ్రాముల సగ్గుబియ్యంలో దాదాపు 350 కేలరీలు ఉంటాయి. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఇవి దోహదపడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సగ్గు బియ్యంలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకల సాంద్రతను పెంచి, అవి దృఢంగా ఉండడానికి సాయపడుతుంది. సగ్గు బియ్యంలో శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు లభిస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకలను క్షీణింపజేసే వ్యాధులు రాకుండా కట్టడి చేస్తుంది.
కండరాల పెరుగుదలకు సాయపడుతుంది. సగ్గుబియ్యంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు పని చేసినా, కండరాలు అలసిపోవు. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ కారనంగా చిన్న పిల్లల్లో నరాల బలహీనతలు రాకుండా కాపాడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ఉంచి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. సగ్గుబియ్యంలో ఐరన్ తగు మోతాదులో ఉంటుంది. ఈ కారణంగా శరీరంలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.