గుంటూరు జిల్లా పెదకాకాని వై జంక్షన్ సమీపంలో ఉన్న ఎంఆర్ఎస్ పెట్రోల్ బంకులో దాసరిపాలెం గ్రామానికి చెందిన నవీన్ రెండు నెలలుగా పంపు బాయ్ గా పని చేస్తున్నాడు. నెలలో ఎక్కువగా సెలవులు పెట్టడంతో పాటు ఓ కారుకు పెట్రోల్ కొట్టాల్సి ఉండగా డీజిల్ కొట్టాడు. రెండు రోజులుగా డ్యూటీకి రాకపోవడంతో పెట్రోల్ బంక్ మేనేజర్ సంపత్ దాసరిపాలెం వెళ్లి పనికి రావాలని చెప్పాడు. తల్లిని వెంటబెట్టుకుని వచ్చిన నవీన్ జీతం లెక్క చూస్తే మూడు వేల రూపాయలు బాకీ పడ్డాడు. దీంతో నవీన్ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంపత్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు నవీన్ వెల్లడించాడు.