ప్రధాని మోదీ ప్రకటించిన పథకం ద్వారా ఐదేళ్లలో 14,500 పాఠశాలలు అభివృద్ధి చెందితే... మిగిలిన ప్రభుత్వ పాఠశాలలు అలా మారడానికి వందేళ్ల కంటే అధికంగా సమయం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎం శ్రీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు బుధవారం నాటి కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద దేశంలోని 14 వేల పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మారుస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రకటనపై కేజ్రీవాల్ బుధవారం స్పందించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఆయన ప్రధానికి ఓ లేఖ కూడా రాశారు.
దేశంలో ప్రభుత్వ రంగంలో 10 లక్షల పాఠశాలలు ఉన్నాయని ఆ లేఖలో కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన పథకం ద్వారా ఐదేళ్లలో 14,500 పాఠశాలలు అభివృద్ధి చెందితే... మిగిలిన ప్రభుత్వ పాఠశాలలు అలా మారడానికి వందేళ్ల కంటే అధికంగా సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 14 వేల పాఠశాలలకు బదులుగా మొత్తంగా దేశంలోని 10 లక్షల పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని ఆయన ప్రధానిని కోరారు.