వైసిపి పాలనలో నిత్యం భూకబ్జాలు, భూ దందాలు కొనసాగుతున్నాయని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలో బిసి సెల్ నగర ప్రధాన కార్యదర్శి దస్తగిరితో కలిసి టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలదాసు మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం మొదలగు మౌలిక సౌకర్యాలపై చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తే, జగన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని తడిగుడ్డతో గొంతు కోసే పరిపాలన చేస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అడవులు, శ్మశాన వాటికల సమీపంలో సెంటు స్థలం కేటాయించి మోసం చేశారని విమర్శించారు. మీ సేవ కేంద్రాలను రద్దు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని వాపోయారు. సమావేశంలో టిడిపి ఉపాధ్యక్షుడు, 15వ డివిజన్ ఇన్చార్జి కొండ సుబ్బయ్య, నగర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నాదెళ్ల దస్తగిరి పాల్గొన్నారు.