తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను పిల్లల ద్వారా తీర్చుకోవాలనే తపనతో బాల బాలికలపై ఒత్తిడి పెరుగుతోందని, లక్ష్యాలను చేరుకోలేక సున్నితమైన మనస్కులు కొందరు ఆత్మహత్యల వైపు వెళుతున్నారని, అది సరైన విధానం కాదని యోగివేమన విశ్వవిద్యాలయం విసి మునగల సూర్య కళావతి అన్నారు. శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం మనోవిజ్ఞానశాస్త్ర శాఖ ఆధ్వర్యంలో 'వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే' సందర్భంగా చైతన్య కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన విసి మాట్లాడుతూ తమ బాల్యం సంతోషకరంగా సాగిందని, ప్రస్తుతం 5వతరగతి నుంచే ఐఐటి చదువుల వైపు పరుగులెత్తడం బాధాకరమని వాపోయారు. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, మనో విజ్ఞాన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ వి. లాజర్, వైవీయూ పాలక మండలి సభ్యురాలు పి. పద్మ, మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ సహ ఆచార్యులు, సదస్సు కో కన్వీనర్ డాక్టర్ కె. లలిత, సహ ఆచార్యులు పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.