ఉక్రెయిన్ పై ఇన్నాళ్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన రష్యా తాజాగా తన ఉనికిని కోల్పోతుందా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు ఏడు నెలలు గడిచిపోతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచం మొత్తం ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కాలక్రమేణా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సరికొత్త పరిణామాలు సంభవిస్తూ పోతుండటంతో... ఈ విషయంపై జనాలకు ఆసక్తి సన్నగిల్లింది. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే... ఈ యుద్ధంలో రష్యాకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది.
ఖార్ఖివ్ ప్రావిన్స్ లోని ఇజియంను ఉక్రెయిన్ కు రష్యా కోల్పోయింది. ఇది రష్యాకు ఎదురు దెబ్బేనని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతంలో రష్యా బలగాలు గత కొన్ని నెలలుగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆధిపత్యాన్ని సాధించడం కీలక మలుపుగా భావిస్తున్నారు. మరోవైపు, తమ లక్ష్యం నెరవేరేంత వరకు ఉక్రెయిన్ పై తమ దాడి కొనసాగుతుందని ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంగా చెప్పడం గమనార్హం.