ఈనెల 19, 20వ తేదీలలో కడప చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పించా ప్రాజెక్టు నుండి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వరకు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ నాయకులు, రైతు సంఘ నాయకులు, ప్రజలు, మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ నాయక్ మంగళవారం సుండుపల్లి లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు.
తెగిపోయిన పించా ప్రాజెక్టు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలి. ఐదు సంవత్సరాల క్రితం సుండుపల్లి మరియు వీరబల్లి మండలాల ప్రజలకు తాగునీటిని అందిస్తామని పాలకులు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని, జరికోన ప్రాజెక్టు నుండి సుండుపల్లి మండలానికి కాలువలు ఏర్పాటు చేయాలని, సుండుపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని నినాదంతో ఈ పాదయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.