వైసీపీ నేత, కౌన్సిలర్ మారుతీ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదిలావుంటే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. సత్యసాయి జిల్లా పరిధిలోని హిందూపురం మునిసిపల్ కౌన్సిలర్, వైసీపీ నేత మారుతీ రెడ్డిని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఇప్పటికే హిందూపురంలోని మారుతీ రెడ్డి ఇంటికి రెండు సార్లు వెళ్లిన సీబీఐ అధికారులు ఆయనను ఈ కేసు విషయంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సోమవారం రెండో సారి ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు... ఆ మరునాడే అరెస్ట్ చేయడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పిటిషన్లు దాఖలు కాగా... వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు వాటిలో చాలా వాటిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు పోస్టయ్యాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సోమవారం ఓ మహిళ సహా ఏడుగురు వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ మరునాడే వైసీపీ కౌన్సిలర్ మారుతీ రెడ్డిని అరెస్ట్ చేసింది.