కంగారూ తన యజమానిని చంపేసింది. తనను పెంచుకుంటున్న వ్యక్తిని ఓ కంగారూ చంపేసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. ఓ కంగారూ మనిషిని చంపడం 86 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కంగారూ దాడిలో తీవ్రంగా గాయపడిన 77 ఏళ్ల వృద్ధుడిని గమనించిన బంధువులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అది వచ్చే సరికే ఆయన ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందిని కంగారూ అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాని వల్ల ముప్పు పొంచివుందని భావించి కాల్చి చంపినట్టు తెలిపారు.
చనిపోయిన వృద్ధుడు ఆ కంగారూను పెంచుకుంటున్నట్టు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల చేతిలో హతమైన కంగారూ ఏ జాతికి చెందినదన్న విషయాన్ని నిర్ధారించలేదు. ఏడు అడుగులకు పైనే ఉన్న ఈ మగ కంగారూ 70 కేజీల బరువున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలో చివరిసారి 1936లో ఓ కంగారూ మనిషిని చంపేసింది. ఆ తర్వాత జరిగిన తొలి ఘటన ఇదేనని స్థానిక మీడియా తెలిపింది.
ఇదిలావుంటే న్యూ సౌత్‌వేల్స్‌లో ఇటీవల రెండు కుక్కలపై ఓ పెద్ద కంగారూ దాడికి దిగింది. దాని బారి నుంచి వాటిని రక్షించే ప్రయత్నం చేసిన 38 ఏళ్ల విలియం క్రూక్‌షాంక్‌పై కంగారూ దాడిచేసింది. ఈ ఘటనలో అతడి దవడ పగిలిపోయింది. తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.