వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించే గణేష్ యోక్క లడ్డుకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ యే తాజాగా ఓ ఊరును ఆదుకొంది. ఏలూరు జిల్లాలో ఓ ఊరికి మంచి ఆలోచన వచ్చింది. అధ్వానంగా మారిన ఊరి రోడ్డును ఇటీవల గణపతి లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో బాగు చేసుకుంటున్నారు. కలిదిండి మండలంలోని తాడినాడ- చినతాడినాడ ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 5 కిలో మీటర్లు ఉన్న మార్గాన్ని అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా రోడ్డు రిపేర్ చేయలేదు. అప్పుడే వారికి మంచి ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేశారు.
గణపతి నవరాత్రుల్లో వచ్చిన విరాళాలతో రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆయా కమిటీల సభ్యులు నిర్ణయించారు. తాడినాడలో మొత్తం 4 చోట్ల వినాయక మండపాలు చేయగా లడ్డూ వేలం ద్వారా వచ్చిన రూ.2.50 లక్షలతో 3 కి.మీ. మేర రోడ్డు మరమ్మతు పనులు శుక్రవారం ప్రారంభించారు. చినతాడినాడ గ్రామస్థులూ రూ.లక్ష విరాళాలు సేకరించి గోతులను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. స్థానికులు చేస్తున్న గొప్ప పనిని అందరూ అభినందిస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.