అపోహలు నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తాయి. అలాంటి అపోహయే ఏపీలో ఇపుడు జోరుగా ప్రచారంలోవుంది. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై ఏపీకి చెందిన శాస్త్రవేత్తలు స్పందించారు. గొంగళి పురుగు ఆకారంలో ఉండే ఓ పురుగు మనుషులను కుడితే ఐదు నిమిషాల్లో మరణిస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి తెలియజేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పురుగుల కారణంగా మనుషులు మరణిస్తారని ప్రచారం జరుగుతోంది అన్నారు.
ఈ ప్రచారంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. ఈ పురుగును నేటిల్‌మాత్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎక్కువగా విదేశీ అడవుల్లో ఉంటుందని.. మన దేశంలో చాలా అరుదుగా పండ్ల తోటల్లో కనిపిస్తుందని తెలిపారు. ఈ పురుగును తాకితే మంట, దురద ఏర్పడుతుందని.. అది కూడా ఒక్క రోజులోనే తగ్గిపోతుంది అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.
ఈ పురుగు లద్దె పురుగు ఆకారంలో ఉండి.. శరీరంపై వెంట్రుకలతో ఉంటుంది. ఈ వెంట్రుకల చివరిభాగం లో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుంది. ఇది ఆ పురుగుకు ఆత్మరక్షణ కోసం ఉంటుంది. ఇది ఆకుల క్రింది వైపు ఉండి.. ఆకులను తింటూ ఉంటుంది. ఈ పురుగు ప్రత్తి పంటలో అసలు కనపడదు. రైతులందరూ దీనిని అర్థం చేసుకొని ఇలాంటి నిరాధారమైన ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు.
గత 2 - 3 రోజుల నుంచి వాట్సప్ గ్రూపులో పత్తి పంటలో ఒక పురుగు ఉంది.. ఆ పురుగు మనిషిని తాకిన వెంటనే 5 నిమిషాల్లో మనిషి చనిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. జాగ్రత్తగా ఉండండి అని అందర్నీ భయపెడుతూ పురుగు ఫోటోలు, చనిపోయినట్టు ఉన్న మనుషుల ఫోటోలను, ఆడియో మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.