మనదేశానికి చీతల రాకతో వాటిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదిలావుంటే మన పూర్వీకులు చీతలను ఇంటి ముందు కట్టేసివుంచే వారని, వేట కోసం కూడా వాటిని ఉపయోగించేవారంటా. ఇళ్ల ముందు ఆవులు, మేకల్లా కట్టేసి ఉంచుకునేవారు. వన్యప్రాణుల వేట కోసం వినియోగించుకునేవారు. చీతాలను ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అయితే మధ్యలో ఇతర జంతువులను చూసినా, పెద్ద సంఖ్యలో మనుషులను చూసినా బెదిరి దాడి చేస్తాయన్న ఉద్దేశంతో వాటి కళ్లకు గంతలు కట్టేవారు. అడవిలోకి వెళ్లాక కళ్ల గంతలు విప్పి వన్యప్రాణులున్న వైపు వదిలేవారు.
అత్యంత వేగంగా పరుగెత్తే చీతాలు.. జింకలు, దుప్పులు వంటి జంతువులను వేటాడేవి. చీతాల యజమానులు ఆ జింకలు, దుప్పుల మాంసం తెచ్చుకునేవారు. అదే జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్ నెస్ వీడియోలో ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రాన్ని కూడా పర్వీన్ పోస్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన బయాలజిస్ట్, ఆర్టిస్ట్ అయిన మరియన్ నార్త్ 1878లో విడుదల చేసిన పుస్తకంలో ఆ పెయింటింగ్ ఉందని పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాజస్థాన్ లో జింకలను వేటాడడానికి పెంపుడు చీతాలను తీసుకెళ్తున్న ఫొటోను, ఛత్తీస్‌గఢ్‌లో కింగ్ ఆఫ్ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను కూడా పర్వీన్ పోస్ట్ చేశారు. భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయినట్టు 1952లో అధికారికంగా ప్రకటించింది. 1972లో తొలిసారిగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టాన్ని తెచ్చింది. ప్రస్తుతం దేశంలో కొన్ని రకాల జంతువులు చీతాల్లా అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే భవిష్యత్తులో వాటిని ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని పర్వీన్ కశ్వాన్ వ్యాఖ్యానించారు.