బ్రిటీషు వారు తమ పాలనకాలంలో వివిధ దేశాలలోని విలువైన వస్తువులను తీసుకెళ్లారు. అలా మన దేశం నుంచి కోహినూర్ డైమాండ్ ను తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికానుంచి కూడా ఓ వజ్రం నాడు తీసుకెళ్లారటా. ఇదిలావుంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణించిన నేపథ్యంలో, తమ వద్ద నుంచి తీసుకెళ్లిపోయిన వజ్రాలను వెనక్కి ఇవ్వాలంటూ పలు దేశాలు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి చెందిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికా కూడా తమ దేశానికి చెందిన కులినన్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద కట్ డైమండ్ గా దీనికి పేరుంది. 1905లో దక్షిణాఫ్రికా గనుల్లో ఈ వజ్రం లభ్యమైంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ వజ్రం బ్రిటీష్ రాయల్ కుటుంబం వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో కులినన్ డైమండ్ ను వెంటనే ఇచ్చేయాలని ఆ దేశ సామాజిక కార్యకర్త సబేలో డిమాండ్ చేశారు. change.org లో కూడా ఆయన ఈ పిటిషన్ ను లాంచ్ చేశారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ పిటిషన్ కు మద్దతు పలికారు.
మరోవైపు దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తమ దేశం నుంచి దొంగిలించిన వజ్రాలు, బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కులినన్ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుంది. 1600 ఏళ్ల నాటి పట్టాభిషేక కార్యక్రమాల్లో ఉపయోగించిన రాజదండంలో పొదగబడి ఉంది. ప్రస్తుతం దీన్ని టవర్ ఆఫ్ లండన్ లోని జెవెల్ హౌస్ లో బహిరంగ ప్రదర్శనకు ఉంచినట్టు ఏబీసీ న్యూస్ తెలిపింది.