బ్రిటన్ రాణి ఎలిజబెత్2 అంత:క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రిటన్ కొత్త రాజు చార్లెస్3తో సమావేశం అయ్యారు. లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు ముందు ఆదివారం రాత్రి బకింగ్ హామ్ ప్యాలెస్‌లో కొత్త రాజుని ద్రౌపది కలిశారు. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలలో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి శనివారం సాయంత్రమే లండన్ చేరుకున్నారు. బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2కి ప్రపంచం నేడు వీడ్కోలు పలుకనుంది. 96 ఏళ్ల ఎలిజబెత్2 ఈనెల 8న మరణించిన సంగతి తెలిసిందే.
ఆమె అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. విదేశీ రాజ కుటుంబీకులు, ప్రపంచ నాయకులు రాణి కుటుంబంతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే లండన్ చేరుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మా న్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరవుతున్న ప్రముఖుల్లో ఉన్నారు.