ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీతారామశాస్త్రీ రచనలో ఇక అక్షర రూపంలో...తానా ప్రయత్నం

international |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 11:10 PM

సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల రచనలు అక్షర రూపంలో తొలి సంపుటి అందుబాటులోకి వచ్చింది. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన అక్షరఝరిని తానా ప్రపంచ సాహిత్యవేదిక పుస్తకరూపంలో తీసుకొచ్చేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. సిరివెన్నెల కుటుంబంతో కలసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం ఆరు సంపుటాలలో ఈ సాహిత్యాన్ని ప్రజలకు అందజేయాలని తానా నిశ్చయించింది. సినీ గేయాలను నాలుగు సంపుటాలుగా, సినీయేతర సాహిత్యాన్ని మరో రెండు సంపుటాలుగానూ తీసుకువచ్చే బృహత్తర పధకానికి శ్రీకారం చుట్టింది.


ఈ నేపథ్యంలో మొదటి సంపుటి అమెరికాలో ప్రస్తుతం లభ్యమవుతోందని తానా ప్రపంచ సాహిత్య వేదిక తెలిపింది. మిగిలిన సంపుటాలు ముద్రణ దశలో ఉన్నాయని, అవికూడా త్వరలో లభ్యమవుతాయని పేర్కొంది. పుస్తకం కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని తానా సాహిత్య వేదిక నిర్వహకులు డాక్టర్ తోట కూర ప్రసాద్ తెలిపారు. ఫోన్ నెంబరు 817-300-4747 లేదా prasadthotakura@gmail.comను సంప్రదించాలని సూచించారు.


ఇదిలావుంటే ఈ ఏడాది 20న సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ ఉత్సవాలను హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించగా... సిరివెన్నెల కుటుంబసభ్యులు కూడా సహకారం అందించారు. అదే వేదికపై సిరివెన్నెల సమగ్ర సాహిత్యంలోని తొలి సంపుటాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.


తాజా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నిర్వహణలో, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గౌరవ సంపాదకులుగా, ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిరివెన్నెల అభిమానులకు తరగని సిరిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని తానా పేర్కొంది.


సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యం కారణంగా గతేడాది నవంబరు 30న కన్నుమూశారు. మూడున్నర దశాబ్దాలకు పైగా తన సినీ ప్రయాణంలో గేయ రచయితగా అనేక చిత్ర విజయాలకు దోహదపడ్డారు. ఆయన పాటలు సినిమాకు సంబంధించినవే అయినా, సమాజాన్ని సూటిగా ప్రశ్నించేలా ఉండేవి. పద విన్యాసాల కంటే భావానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సిరివెన్నెల నేటితరం గీతరచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల సినిమాతోనే సీతారామశాస్త్రి గేయ రచయితగా కెరీర్ ప్రారంభించారు. తన మొదటి సినిమాకే ఆణిముత్యాల్లాంటి పాటలను అందించిన సీతారామశాస్త్రి.. ఆ సినిమా పేరుతోనే తన ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com