నేటి ఆధునిక యుగంలో యువతీ, యువకులు తమ పరిదులు మరిచి వ్యవహరిస్తున్నారు. వాటి పర్యావసనాలు కూడా అనుభవిస్తున్నారు. బెంగళూరులో యువ వైద్యుడి హత్య కేసు మిస్టరీని కర్ణాటక పోలీసులు చేధించారు. వైద్యుడికి కాబోయే భార్యే ఈ హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. సోషల్ మీడియాలో తనతో పాటు తల్లి ప్రయివేట్ వీడియోలను షేర్ చేశాడనే అక్కసుతో యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. చెన్నైకి చెందిన డాక్టర్ వికాస్ (27)పై సెప్టెంబరు 10న హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయాలతో బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 18న వికాస్ మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రయివేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వికాస్‌పై కక్ష పెంచుకున్న యువతి.. తన ఇంటికి ఆహ్వానించి స్నేహితుల సాయంతో దాడిచేసిందని చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ వికాస్, నిందితురాలు ప్రతిభ (25) ఇద్దరూ చెన్నైకి చెందినవారని, ఆమె బెంగళూరులో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోందని తెలిపారు. రెండేళ్ల కిందట ఇద్దరికీ సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయం ఇరువురూ పెద్దలకు చెప్పడంతో వారు పెళ్లికి అంగీకరించారు. వచ్చే నవంబరులో పెళ్లి చేయాలని నిర్ణయించారు.
ఉక్రెయిన్‌లో మెడిసిన్ పూర్తిచేసి చెన్నైలో ప్రాక్టీస్ పెట్టిన వికాస్.. పీజీ నీట్ కోచింగ్ కోసం బెంగళూరుకు వచ్చాడు. కాబోయే భార్య కూడా అక్కడే ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరూ సహజీనవం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రతిభతో ఏకాంతంగా గడిపినప్పుడు ఆమెకు తెలియకుండా వీడియోలను తీశాడు. అలాగే, ఆమె తల్లి ప్రయివేట్ వీడియోలను రికార్డు చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి వీడియోలు షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలపై వికాస్, ప్రతిభ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసి షాకైన ప్రతిభ.. అలా ఎందుకు చేశావని వికాస్‌ను నిలదీసింది. అయితే, అతడు సరదా కోసం చేశానని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ప్రతిభ.. విషయం గురించి స్నేహితులు సుశీల్, గౌతమ్, సూర్యలతో చెప్పి వాపోయింది.
దీంతో వికాస్‌ను హత్య చేయాలని నిర్ణయించారు. పథకం ప్రకారం వికాస్‌ను సెప్టెంబరు 10న తన ఇంటికి సుశీల్ ఆహ్వానించాడు. ఈ విషయం తెలియని వికాస్ అక్కడకు వెళ్లి వారి చేతుల్లో చావుదెబ్బలు తిన్నాడు. ఇంటిని శుభ్రం చేసుకునే మాప్ స్టిక్, ఇతర ఆయుధాలతో వికాస్‌పై దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ప్రతిభ, ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను సోమవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సూర్య కోసం గాలిస్తున్నారు.