యుద్దం నేపథ్యంలో తన ఆర్థిక అవసరాల కోసం రష్యాకు భారత్ ప్రధాన వనరుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని సైతం భారతదేశం తనకు అనుకూలంగా మల్చుకొంటోంది. ఇదిలావుంటే ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య సంక్షోభం ప్రారంభమైనప్పుడు.. భారత ఆయిల్ బాస్కెట్‌లో రష్యన్ క్రూడాయిల్ వాటా చాలా తక్కువ. కానీ అభివృద్ధి చెందిన దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలతో ఆ దేశం మన భారత్‌కు భారీ డిస్కౌంట్లో ఆయిల్‌ను ఆఫర్ చేసింది. దీంతో రష్యా వాటా భారత ఆయిల్ బాస్కెట్లో పెరిగింది. భారత్‌కు ఆయిల్‌ను చేయడంలో సౌదీ అరేబియాను దాటేసి మరి రష్యా రెండో అతిపెద్ద ఆయిల్ సరఫరాదారిగా నిలిచింది.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు.. భారత్ క్రూడాయిల్ బాస్కెట్‌లో రష్యా వాటా కేవలం 2 శాతంగానే ఉండేది. 2021 ఏడాదంతా కేవలం రష్యా నుంచి 12 మిలియన్ బ్యారల్స్ క్రూడాయిల్‌ను మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు దేశీయ ఉత్పత్తికి మించిపోయి రష్యా నుంచి ఈ దిగుమతులు చేపడుతున్నాం. రష్యా వాటా ప్రస్తుతం 12 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి మే 2022 మధ్య కాలంలో.. రష్యన్ ఆయిల్ దిగుమతులు భారత్‌కు 4.7 టైమ్స్ పెరిగాయి. రష్యా ఆఫర్ చేసిన భారీ డిస్కౌంట్లతో భారత్ బాస్కెట్లో రష్యా వాటా పెరిగింంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన మూడు నెలల్లో భారత్ రష్యన్ ఆయిల్, గ్యాస్, కోల్ కోసం 5.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. మే నెలలో భారత్‌లోకి వచ్చిన రష్యన్ క్రూడాయిల్ 7,40,000 బ్యారల్స్ అని తెలిసింది. అయితే ధరలు పెరిగినప్పుడు మంచి డీల్స్ కుదుర్చుకోవడం సాధారణమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అన్నారు. ఈ క్రమంలోనే భారత్ రష్యాతో డీల్ కుదుర్చుకుని డిస్కౌంట్లో ఆయిల్ కొనుగోలు చేసింది.
సంక్షోభం ప్రారంభమైన తర్వాత.. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంతో.. ఆ దేశం బ్యారల్‌పై 35 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. దీంతో ఈ డిస్కౌంట్ ధరను భారత్ అందిపుచ్చుకుంది. డిస్కౌంట్లో రష్యన్ ఆయిల్ ను సరఫరా చేసుకోవడం ద్వారా భారత్ సుమారు రూ.35 వేల కోట్ల లాభపడినట్టు తెలిసింది. ఈసారి మళ్లీ డిస్కౌంట్లో ఆయిల్ ఇస్తామంటూ రష్యా ఆఫర్ చేస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, డాలర్లను ఆదా చేసేందుకు ఈ డిస్కౌంట్లు భారత్‌కు సాయపడినట్టు తెలిసింది. దీనివల్ల రూపాయి మరింత పతనం కాకుండా కూడా ఆగింది.