మచిలీపట్నం నగర పరిధిలోని చింతగుంటపాలెం సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మండల పరిధిలోని వెంకట దుర్గాంబపురం(గరవు) గ్రామానికి చెందిన ఆరుగురు గిలకలదిండిలో బంధువులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరై ఆటోలో తిరిగి వస్తుండగా చింతగుంటపాలెం సమీపంలో అదుపుతప్పిన ఆటో కరెంటు స్తంభానికి ఢీకొట్టింది.
ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న వారికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, తెదేపా పొలిట బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, వైకాపా నాయకుడు పేర్ని కృష్ణమూర్తి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇనగుదురు పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.